తమపై నిరాధార ఆరోపణలు చేస్తే… కఠిన చర్యలు తప్పవన్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఇలా ఎందుకు స్పందించారంటే… బంజారాహిల్స్ పోలీసులపై సోషల్ మీడియాలో ఓ దంపతులు ఆరోపణలు చేశారు. ఆ వివాహిత చేసిన లైంగిక ఆరోపణలను ఖండించిన వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్… ఆరోపణలపై వాస్తవాలు చెప్పాలనీ, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ వివాహిత చెప్పిన దాని ప్రకారం… ఓ వ్యాపార వివాదంలో ఆమె భర్తపై కేసు నమోదైంది. డిసెంబర్ 8న పోలీసులు ఆమెకు కాల్ చేసి, భర్తతోపాటూ ఆమెను కూడా సాయంత్రం 4 గంటలకి స్టేషన్‌కి పిలిపించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో… భార్యాభర్తల్ని ఫస్ట్ ఫ్లోర్‌లోని డీఐ రూమ్‌కి తీసుకెళ్లారు. ఆమె హ్యాండ్ బ్యాగ్, దంపతుల దగ్గరున్న ఫైల్స్, సెల్ ఫోన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె డ్రెస్ చింపేసి, అసభ్యంగా ప్రవర్తించారు. అలా తనను చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రూ.20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలనీ, లేదంటే ఎన్కౌంటర్ చేస్తామని సీఐ కళింగరావు బెదిరించారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. ఆ వ్యాపార వివాదం ఇప్పటిది కాదు. ఎప్పుడో 7 నెలల కిందట పోలీసులు ఈ వివాదంలో తలదూర్చారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. అప్పటి నుంచీ తనను, తన భర్తనూ వేధిస్తున్నారని ఆమె అంటున్నారు. పోలీసులు తనతో మిస్ బిహేవ్ చేసిన అంశానికి సంబంధించి తన దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయన్న ఆమె… వాటిని ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్ అయింది.
