జనసేనకే కాదు.. వైసీపీకి ఆయన తలనొప్పే..!

Politics

తన మాటలు, చేతలతో సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీలోను చిచ్చు రేపుతున్నాడు. జనసేన తరపున గెలిచి ముఖ్యమంత్రి జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత పార్టీకే కాకుండా అధికార వైసీపీకి తలనొప్పిగా మారారు.

రాపాక వరప్రసాద్.. జనసేన తరపున పోటీ చేసిన పవన్ కల్యాణ్ సహా అందరూ ఓడిపోగా.. వైసీపీ ఊపులోను రాజోలులో తాను మాత్రం గెలిచి తానేంటో చూపించారు. అయితే, గెలిచినప్పట్నించి అధికార వైసీపీతో ఆల్‌మోస్ట్ అంటకాగుతున్న రాపాక వరప్రసాద్ మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న ఇంగ్లీషు మీడియం విధానాన్ని అసెంబ్లీలో సమర్థించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆ తర్వాత కూడా తన స్టైలే వేరేనని చాటుకుంటున్నారు రాపాక. అయితే.. రాపాక వైసీపీలో చేరతారన్న ప్రచారం ఒకవైపున జోరుగా కొనసాగుతోంది. ఇదిలా వుంటే రాపాక వైఖరితో రాజోలు వైసీపీ నేతలు, శ్రేణులకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడినట్లు తాజా సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ రాజోలు నియోజకవర్గం ఇంఛార్జి బొంతు వెంకటేశ్వరరావుకు పార్టీపై పట్టు బాగానే వుంది. కానీ అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొనలేక పోవడంతో పార్టీలో ఆయన దర్జా కనిపించడం లేదు. అదే సమయంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్న ఎమ్మెల్యే రాపాక తాను వైసీపీ లీడర్ని అనే స్థాయిలో ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్న రాపాక వరప్రసాద్‌ చుట్టూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున చేరుతున్నాయట. దాంతో నియోజకవర్గ ఇంఛార్జిగా తానున్నా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోతోందని వైసీపీ ఇంఛార్జి బొంతు వెంకటేశ్వరరావు మధనపడుతున్నారట. అటు సొంత పార్టీని, ఇటు వలస పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్న రాపాక మాత్రం తన వ్యూహానికి తానే మురిసిపోతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *