అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు దుమారం కొనసాగుతోంది. పది సంవత్సరాలు నిండని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సర్వీసు నుండి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు 4వ తేది ప్రజాశక్తి మొదటి పేజీలో పతాక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ‘అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు మొదలైంది’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ కథనం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయంపై పలు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు సోమవారం నాడు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల మెడపై సర్కారు కత్తి పెట్టిన తీరును వివిధ పత్రికలు ప్రచురించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విలేకరులతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ‘కమ్యూనికేషన్‌ గ్యాప్‌’ వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ మేరకు జారీ అయిన మెమోపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. అదే సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ‘కొన్ని శాఖల్లో కొంతమందికి’ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని ఆయన చెప్పారు. ‘ఏ శాఖల్లో .. ఎంత మందికి’ అన్న విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. విలేకరులు ఇదే విషయాన్ని ప్రశ్నించడంతో ‘నిబంధనలకు విరుద్దంగా కొన్ని నియమాకాలు జరిగాయి’. అని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి వెలువడిన ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ‘తొలగింపు’ ఆదేశాలు అమలు జరుగుతూనే ఉన్నట్లు సమాచారం. ఆడిట్‌ విభాగంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సిఎం ఆదేశించారని సజ్జల చెప్పినా ఆ శాఖలో సిబ్బందికి వ్యక్తిగతంగా కూడా తొలగింపు ఉత్తర్వులు అందినట్లు సమాచారం. పంచాయతీరాజ్‌ శాఖతో పాటు, సాంఘిక సంక్షేమశాఖలోనూ తొలగింపు ఆదేశాలు జారీ అయినట్లు వార్తలు వచ్చాయి.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *