మిల్లర్ల ప్రమేయం లేకుండా తొలిసారి ధాన్యం సేకరిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒకపైసా తగ్గకుండా రేటు రావాలన్న ఉద్దేశ్యంతో కొత్త విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రవాణా, లేబర్‌ఖర్చుల రీ-ఎంబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలన్నారు. రవాణాఖర్చులు, గన్నీబ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియాలని దీనికోసం ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి వారికి నగదు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్‌లో సిగల్స్‌ సమస్యల వల్ల అక్కడక్కడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏర్పడిన సందర్భాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి సిగల్‌ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్‌ అయ్యేలాగా మార్పులు చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేలా ఆర్‌బికెల్లో పోస్టర్లు అంటించాలని, దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుందన్నారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులకు సంబంధించి నిబంధనావళిని రూపొందించి, దానిని పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలని అన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *