రాష్ట్రంలోని 1,400 దళితవాడల్లో దేవాలయాల నిర్మాణ బాధ్యతలు ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైన సమరసత సంస్థకు కేటాయించడం పట్ల సిపిఎం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభ్యంతరకం. ఆక్షేపణీయం.’ అని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా అయిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాలయాల నిర్మాణంపై చేసిన ప్రకటనను ఈ లేఖలో ఆయన ప్రస్తావించారు. 340 దేవాలయాల నిర్మాణ బాధ్యతలను ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో నడుస్తున్న సమరసత ఫౌండేషన్‌కు అప్పగిస్తునట్లు ప్రకటించిన మంత్రి ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షలు కేటాయించారని వివరించారు. సమరసత తరహా సంస్థ ఘర్‌వాపసి పేరుతో దళితవాడల్లో, కాలనీల్లో వివిధ మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. మత సమరస్యానికి విఘాతం కలిగిస్తోందని, రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ బిజెపికి ఉపకరించే రీతిలో పనిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమరసతా ఫౌండేషన్ లాంటి సంస్థలకు ప్రభుత్వ నిధులను కేటాయించి, దేవాలయాల నిర్మాణ బాధ్యతలు అప్పగించటం సరికాదని తెలిపారు. ధార్మిక సంస్థయిన టిటిడితో వారికి లంకె పెట్టడం ప్రమాదకరమని తెలిపారు. మత ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, లౌకికస్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తున్న సంస్థలకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం, ప్రభుత్వ నిధులను కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.