విశాఖపట్నం : 2024లో భీమిలి రాజకీయ ముఖచిత్రం మారనుందా? అవుననే అంటున్నారు కొందరు తలపండిన రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో అన్నిపార్టీలకు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండడం, ఒక్కోసారి ఒక్కొ పార్టీ విజయం సాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రానున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై బలమైన చర్చలు, వాదనలు జరుగుతున్నాయనే చెప్పాలి .ప్రస్తుతానికి స్థానికత డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
అతి పెద్ద నియోజక వర్గం భీమిలి…
తాజాగా వెలువడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే గనుక విభజిత విశాఖ జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం భీమిలినే. ఓటర్లతో పాటు విస్తీర్ణం కూడా ఎక్కువే. ప్రధాన సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఇటీవల నవంబర్ 9న విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం 3,18,624 మంది ఓటర్లుండగా, పురుషులు 1,57,826 మహిళలు 1,60,777 మంది ఉన్నారు.
అపుడే ఊపందుకున్న రాజకీయ సమీకరణలు
నిర్దేశిత గడువు 2024కంటే ముందుగానే ఏడాది ముందు 2023లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని ఊహాగా నాలు వినిపిస్తున్న నేపథ్యంలో అపుడు రాజకీయ సమీక రణల జోరు ప్రధాన పార్టీల్లో ఊపందుకుందనే చెప్పాలి.
స్థానికత చుట్టూ 2024 ఎన్నికలు?
2024 ఎన్నికల్లో రాజకీయ సమీకరణలన్నీ స్థానికత చుట్టూ కచ్చితంగా తిరగనున్నాయనే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పక్కనే ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి,అల్లూరి, జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లో స్థానికులే అక్కడ ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలోనూ అలాగే జరగాలని స్థానిక యువత భావిస్తోందని,ఇప్పటికే వైసిపి కేడర్ ఈ విషయాన్ని సిఎం జగన్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో స్థానిక యువతకే అవకాశం కల్పించాలని పార్టీ అధినేత జగన్ వద్ద ప్రస్తావించినట్లు భోగట్టా. అందుకు తగ్గట్టుగానే తాజా రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైపైకి ‘అభ్యర్థి ఎవరనేది అప్రస్తుతం, జగన్ అదేశాలే శిరోధార్యం’ అని మెజారిటీ కార్యకర్తలు అంటున్నప్పటికీ, లోలోపల స్థానికత అంశం బలంగా పనిచేయనుందని తెలుస్తోంది.
