జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించింది. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో దాదాపు 50 నగరాల్లో 200కుపైగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలు పలు సూచనలు చేశాయి. తొలుత విదేశాంగ మంత్రిత్వ వాఖ ఏడాది పాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ జి20 ప్రెసిడెన్సీలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘ఇది దేశానికి లభించిన గౌరవం. ఒక పార్టీ లేదావ్యక్తికి కాదు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. దీనిని విజయవంతం చేయడానికి మనమందరం సహకారంతో పని చేద్దాం’ అని ఆయన అన్నారు.