కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతలపై బహుముఖ దాడి చేస్తోందని ఎఐకెఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి, రైతు అమరవీరుల జ్యోతి యాత్ర నాయకులు కృష్ణప్రసాద్‌ విమర్శించారు. ప్రజలపై కేంద్రం తీవ్రమైన భారాలు మోపుతోందన్నారు. దేశంలో ఆహార ధాన్యపు నిల్వలు ఉన్నా, అన్నార్తులకు బువ్వ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13 నుంచి 16 వరకూ కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో జరగనున్న ఎఐకెఎస్‌ జాతీయ మహాసభను పురస్కరించుకుని దొడ్డి కొమురయ్య స్వగ్రామం జనగాం జిల్లా కడవెండి గ్రామం నుంచి రైతు అమరవీరుల జ్యోతి యాత్ర సోమవారం ప్రారంభమైంది. అమరవీరుల జ్యోతిని ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి వెలిగించి ఈ యాత్రను ప్రారంభించారు. అంతకు ముందుకు దొడ్డి కొమరయ్య స్థూపం వద్ద నివాళలర్పించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై కేంద్రంపై సమరశీల పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూ సమస్యను ఎజెండాగా మార్చడమే కాకుండా ప్రపంచ విప్లవ కార్యక్రమాలకు మూల కేంద్రమైందని తెలిపారు. నిజాం పాలనలో అణచివేత, దోపిడీ, వెట్టిచాకిరి వంటి విధానాలకు వ్యతిరేకంగా కుల, మత తేడాలు లేకుండా ప్రజలు ఐక్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఆ పోరాటం ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిదంటూ బిజెపి, సంఘపరివార్‌ శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అమరవీరుల స్ఫూర్తిని రగిల్చించేందుకే కడవెండి గ్రామం నుంచి జ్యోతి యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *